నిర్మలాకాశం
ఆకాశం నిర్మలంగా అనిపించినా
ఆవేశం అందులో సగ భాగమే!
తనే కనిపెంచిన వివేచనను తను
వనేకమార్లు మ్రింగి మిన్నకుంటుంది!
పొగ మంచు మంచిదో కాదో కానీ ముంచుకొచ్చే
మార్పుకు మాత్ర మది నిదర్శనమౌతుంది!
అవకాశం అనవసరాన్నావహిస్తే, అదేశం
లేకుండానే అనర్ధ నిర్మాణం సాగుతుంది!
ఆకలనే అనుమానానికి ఆధారం తోచని మనిషి
వ్యాపకానికి వ్యాపారమనే వ్యాకరణం వ్రాశాడు!
ఉదయం ఊహించక వుండలేనిదే వుదర బంధం
అయినా, రాత్రినే పంచుకొంటుంది రుధిర సంబంధం!
ప్రేమ పవిత్రత పులుముకోవాలంటుంది
తప్ప పాతాళంలో విన్యాసాలు కోరుకోదు!
పైకెగసిక భృకుటి, మైమరచిన తృటి,
సొగసులొలికే కటి, ముముక్షువుకు చీకటే!
కనులున్నందుకే కాంతి ముచ్చటన్నట్టు
నాసికతోనే నసాళపు రుచినెరిగి నట్టు
స్పర్శకు తెలియరాని శబ్దమన్నదే లేనట్టు
వివేకానికి విలువలున్నవిషయమేదీ దూరం కాదు!