Sunday, December 20, 2015

చెదలు తిన్న పుస్తకాలు /chedalu tinna pustakalu

చెదలు తిన్న పుస్తకాలు
చెదిరి పోతున్న జ్ఞాపకాలు
తరాల తన్నుకులాటకు
వరాలు కావలసిన వాస్తవాలు!!

ఆస్తులు పొతే వెరువని మనసును
ఆవేశంగా ఏడ్పించిన స్నేహితులు
అహర్నిశలూ ఆత్రంగా కాపాడినా
అంతం అడ్డుకోలేమన్న ఆనవాళ్ళు

వేదమన్నారొకటి
వాదానికి సాటి మరొకటి
బాధలు దాటేందుకు జ్యోతి
వేరొకటి "ధర్మశ్యః గ్లానిః భవతి"
మెటేరియల్ మానీటరింగ్
బైనరీ కంప్యూటింగ్
వివక్షల సోషలిజం
సమ సమాజ ఫ్యూడలిజం
విలాసాల రోమాంటిజం
రూత్ లెస్ రెలిజియనిజం
అన్నింటా అనర్ధాలకు మెరుగులు
అద్దంలో చూపించిన మిణుగురు పురుగులు!!

ఎప్పటివో అవార్డులు
ఎందుకిచ్చారో గుర్తులేని రివార్డులు
నీవు బ్రతికున్నట్టు నిరూపణ కోరే దేశంలో
నీకంటూ నీ వేషంతో యిచ్చిన గుర్తింపు కార్డులు
పుట్టావన్న ధృవీకరణలు
గిట్టినట్టు ఆమోద ముద్రలు
దాచుకోలేనన్ని దాతల కాగిత పురస్కారాలు
చెల్లుబాటుకాని చెమట తెరచిన 'హ్యూమన్ బ్యాంకు' ద్వారాలు!!

ఎంతో తపించి చేర్చుకొన్న స్నేహితాలవి
ఇతర జీవితాంకాలేవీ వాటితో సాటిరానివి!!

అన్నిటి రుచి చెదకు ఒక్కటే
అన్నిటికీ బాధ దూరమవుతున్నజ్ఞానమొక్కటే
మిగలని ఆస్తులఎడ లేదేన్నడూ మొహం
చిదేమేసిన కాగితాలు మిగిల్చిన యీ శోకం
తరాలకు తానుగా మిగాలాలనుకొనే బాటలకు
శాపాల రూపు దిద్దుకొచ్సిన ఆగచాటులే యీ చెదలు!!

Thursday, October 22, 2015

o cheekati deepam!

ఓ చీకటి దీపం!

నా చుట్టూ అలముకొన్న చీకట్లే నన్ను దీపమని పిలిచేశాయి
నాగుండెల్లో లేదు కొవ్వు, కాలిపోతున్నది కోమలత మాత్రమే
కడవరకూ సాగని కవితలెన్నో జతకలిపి జాలిగా నవ్వి దాటేశాయి
కరగని మంచు కాఠిన్యతకు దీపం కొండెక్కి పోతున్నది!

కాలిన పుండ్లకంటే కవ్వింపులు చేసిన గాయాల బాధ యెక్కువ
పదనిసలు పరిహసించాక పాడిన గేయలేనేమో యీ రోదనలు
ఏంతిని బ్రతికేసిందో జీవితం, శాంతిని భోంచేస్తా నంటున్నది
తీయని జ్ఞాపకాల తెనేతుట్టల నడుమ పట్టులేని పారవశ్యం అవసరమా?

జీవన ప్రమాణాలనే బాణాలు చేస్తున్న అలుపెరుగని జీవహింస
కలుపుతీసిన చేలలో అభివృద్ది పేర జరిగే రసాయన ద్వంశ
అద్దె గర్భాలలో అవకాశం అడుగుతున్నపడుపు పిండాల ప్రశంస
సహజీవనానికి సలింగాలింగనలు సరి అంటున్న స్నేహాల అంశ!

పవిత్ర మీమాంసకు పట్టిన పాకుడుతో పాదం ముందుకు సాధ్యమా?
సాగే వ్యసనాలు సాదరంగా పలికే సౌభాగ్యానికి దర్పం అసలు సత్యమా?
పిలిచి లేడనిపించుకొన్న పరమాత్మకు పగటి కలలలో ప్రతిష్ట ధర్మమా?
రాలిపోయే ఆకులకి, ఆరిపోయే దీపాలకు ఆఖర్లో అలజడి న్యాయమా?


Sunday, August 30, 2015

గొడుగు కర్ర దొరకలేదు


ఏవిటీ వెధవ తంతు
ఎంతచేసినా తరగలేదు నా వంతు
అదేమి ఖర్మో, ఆఖరికి
ఒక్క గొడుక్కర్ర కూడా దొరకలేదు!

అందని బంధాలకోసం వెదికిన
ఆనందాల మందిరాలు మాత్రం మిగిలాయి
చందమామలా కట్టిన మేఘాల గుడులు
వాన తుంపర్లతోనే తెల్లారి పోయాయి!

రాతిగుట్టలు రాచబాట లయ్యాయి కానీ
చిరు కోరికల తీర్పుకు సహనం సాక్షి కాలేదు
ఆ పశుకాపరి కందిన జీవన పరమార్ధం
పాఠాలు నేర్చినా నా కందనిదే యధార్ధం!

సూత్రాలలో బిగించిన నీతులు
వెనుక గోతులు నాకవగతం కాలేదు
కనుపించని మార్గాలలో కనులు మూసుకు నడిచి
నన్నాదుకోరెందుకని ఎన్నడూ నే నడగలేదు
భిన్న ప్రవృత్తుల కుసన్నాహాల విభేధాల మధ్య
నా మనసంగీకరించని నా పన్నాగమేదీ లేనే లేదు
కర్తవ్యం విడిచి దేవుళ్లాడ వలసి వచ్చినపుడు 
దేవుడు లేడని చెప్పటానికి నేనస్సలు వెనుకాడలేదు
నేనంటే యిష్టం లేదని నాకెవరూ చెప్పలేదు
నాలో అసంతృప్తి రేపే కష్టానికి వెల కూడా పెట్టలేదు
నేను నిజమని నా సమయానికి తప్పక తెలుసు
నాతొ సహ భుజానికీ సమాజమెందుకు రాలేదు?

ఏం కావాలని నడిచి వెదుకుతున్నానో నేను, తెలీదు
వంగిన వెన్ను మరో అడుగు ఆసరాకు, గొడుక్కర్ర మాత్రం లేదు!!