Sunday, August 30, 2015

గొడుగు కర్ర దొరకలేదు


ఏవిటీ వెధవ తంతు
ఎంతచేసినా తరగలేదు నా వంతు
అదేమి ఖర్మో, ఆఖరికి
ఒక్క గొడుక్కర్ర కూడా దొరకలేదు!

అందని బంధాలకోసం వెదికిన
ఆనందాల మందిరాలు మాత్రం మిగిలాయి
చందమామలా కట్టిన మేఘాల గుడులు
వాన తుంపర్లతోనే తెల్లారి పోయాయి!

రాతిగుట్టలు రాచబాట లయ్యాయి కానీ
చిరు కోరికల తీర్పుకు సహనం సాక్షి కాలేదు
ఆ పశుకాపరి కందిన జీవన పరమార్ధం
పాఠాలు నేర్చినా నా కందనిదే యధార్ధం!

సూత్రాలలో బిగించిన నీతులు
వెనుక గోతులు నాకవగతం కాలేదు
కనుపించని మార్గాలలో కనులు మూసుకు నడిచి
నన్నాదుకోరెందుకని ఎన్నడూ నే నడగలేదు
భిన్న ప్రవృత్తుల కుసన్నాహాల విభేధాల మధ్య
నా మనసంగీకరించని నా పన్నాగమేదీ లేనే లేదు
కర్తవ్యం విడిచి దేవుళ్లాడ వలసి వచ్చినపుడు 
దేవుడు లేడని చెప్పటానికి నేనస్సలు వెనుకాడలేదు
నేనంటే యిష్టం లేదని నాకెవరూ చెప్పలేదు
నాలో అసంతృప్తి రేపే కష్టానికి వెల కూడా పెట్టలేదు
నేను నిజమని నా సమయానికి తప్పక తెలుసు
నాతొ సహ భుజానికీ సమాజమెందుకు రాలేదు?

ఏం కావాలని నడిచి వెదుకుతున్నానో నేను, తెలీదు
వంగిన వెన్ను మరో అడుగు ఆసరాకు, గొడుక్కర్ర మాత్రం లేదు!!