Sunday, December 20, 2015

చెదలు తిన్న పుస్తకాలు /chedalu tinna pustakalu

చెదలు తిన్న పుస్తకాలు
చెదిరి పోతున్న జ్ఞాపకాలు
తరాల తన్నుకులాటకు
వరాలు కావలసిన వాస్తవాలు!!

ఆస్తులు పొతే వెరువని మనసును
ఆవేశంగా ఏడ్పించిన స్నేహితులు
అహర్నిశలూ ఆత్రంగా కాపాడినా
అంతం అడ్డుకోలేమన్న ఆనవాళ్ళు

వేదమన్నారొకటి
వాదానికి సాటి మరొకటి
బాధలు దాటేందుకు జ్యోతి
వేరొకటి "ధర్మశ్యః గ్లానిః భవతి"
మెటేరియల్ మానీటరింగ్
బైనరీ కంప్యూటింగ్
వివక్షల సోషలిజం
సమ సమాజ ఫ్యూడలిజం
విలాసాల రోమాంటిజం
రూత్ లెస్ రెలిజియనిజం
అన్నింటా అనర్ధాలకు మెరుగులు
అద్దంలో చూపించిన మిణుగురు పురుగులు!!

ఎప్పటివో అవార్డులు
ఎందుకిచ్చారో గుర్తులేని రివార్డులు
నీవు బ్రతికున్నట్టు నిరూపణ కోరే దేశంలో
నీకంటూ నీ వేషంతో యిచ్చిన గుర్తింపు కార్డులు
పుట్టావన్న ధృవీకరణలు
గిట్టినట్టు ఆమోద ముద్రలు
దాచుకోలేనన్ని దాతల కాగిత పురస్కారాలు
చెల్లుబాటుకాని చెమట తెరచిన 'హ్యూమన్ బ్యాంకు' ద్వారాలు!!

ఎంతో తపించి చేర్చుకొన్న స్నేహితాలవి
ఇతర జీవితాంకాలేవీ వాటితో సాటిరానివి!!

అన్నిటి రుచి చెదకు ఒక్కటే
అన్నిటికీ బాధ దూరమవుతున్నజ్ఞానమొక్కటే
మిగలని ఆస్తులఎడ లేదేన్నడూ మొహం
చిదేమేసిన కాగితాలు మిగిల్చిన యీ శోకం
తరాలకు తానుగా మిగాలాలనుకొనే బాటలకు
శాపాల రూపు దిద్దుకొచ్సిన ఆగచాటులే యీ చెదలు!!