వెతకటమంటూ
వెనుదిరగకు!
వేల దావానలాలు
విరివిగా సాగిన దాడులు
క్రుంగదీసి వంచిన నిన్ను
వెనుతిరిగి చూడకు!
అడియాసల ఆవిరులు
అహం చిమ్మిన సందడులు
పరుగులెట్టిన మనసును
మట్టి కరిపించిన రోజులు!
ఉద్వేగపు వూపులకు
ఊతమిచ్చిన సంశయాలు
భ్రంశమయిన స్థితుల కొరకు
రోదించిన వేదన రాత్రులు!
అన్నీ దాటాకనే
నీవీ, అంచు చేరి వున్నావు
అగాధాలు
అలవికావు, అవి
అనాలోచితంగా వెదుకకు!
నీవున్నది నిజమే, అయినా
నీలో వున్నది నిజం కాదు!
మసక వెలుగులో కదిలే మబ్బులు
ఆకాశం కర్ధం చెప్పవు!
ముసి నవ్వుల కోసమో
ముగింపు వాక్యం కోసమో
మిగిలిన జీవిత మనర్ధం కారాదంటే
మరోమారు వెను తిరుగకు!
పిరికితనమనే పంతంలో
చెంతనున్న సమయం వదలకు
ఈ రోజు నీకు నిజం, తెలీనిది,
ఉన్నదో లేదో మరో ‘అజం’!
సృష్టి, వెనుక దృష్టి కోరదు
కోరుంటే, కళ్ళుండేవి మరి!
నీ భయాలేవైన
ముందున్నదే నీ మార్గం!
(అజం అంటే అడుగు అని అర్ధం)