Tuesday, December 6, 2011

నీది కాదది, ఒట్టు! ... ... ... ...


నీది కాదది, ఒట్టు! ...  ... ... ...

ఆశాసౌధాల్లోంచి ఆకాశాన్నందుకోటం,
ఆదిమానవుడి సొత్తులా అనురాగం గుంజుకోటం,
అలవికాని అవినీతిలో అనుభవాల్ని పుంజుకోటం,
అదేం లేదంటూ చివరికంతా గింజుకోవటం!

జీవన గమ్యానికి జీవచ్ఛవాల నడక,
కలనుండి కాటివరకు మధువుతో పడక
స్పందనలేని హృదయం, స్పర్శ తెలీని చర్మం,
ఆకల్లేని ఆతిధ్యం- అదే! అద్దెకొచ్చిన జీవితం!

ఎవరో గుచ్చితే నీకు స్పృహ తెలిసింది!
చితికిన గుండెతో నీలో చితి రగిలింది!
చిన్నతనమనేది చెరగని ముద్ర కాదు!
పరమపదంలో పెద్దరికమనే గడీలేదు!

ఆవేశం అర్ధం చూపే అద్దంకాదు
వేషాన్ని మించిన భాష సృష్టిలో మరోటి లేదు
తలవని తలంపులు, తవ్విన నిజాలు కావు
తరగతుల మధ్య తత్వానికి మాటు లేదు!

కవుల్లోని కమనీయత, కళ్ళ వెనకది!
కంటికిజేరే వున్నా కన్నీరది చూడలేదు!
గుండె లారాక గుడి కట్టుకొంటాడు గుణ తత్త్వేవేత్త!
తినబోయేది పరమాన్నం కాదనుకొనే దిగుతాడు రైతు!

రాలుగాయ వూరగాయి రుచెంతో తెలుసుకదా?
నోటు వెనుక బాట, పరువు నీకు తెలియనిదా?
సహజంకాని సంతృప్తి సాఫల్యానికి కానట్టు
నిజంకాని జీవనం, నీది కాదది, ఒట్టు!

No comments:

Post a Comment