కలలకు కాలాన్ని కలిపితే
కలలకు కాలాన్ని కలిపితే కవిత్వం పుడుతుంది
మనసు కన్నీటితో కడిగితే పవిత్రమే అవుతుంది
గేయ కమనీయత కంఠానిదే గాని కావ్యానిదికాదు!
రమణీయత రాజ్యమేలితే రాగాలవసరమే లేదు!
నువ్వు గుర్తొచ్చి నవ్వుకున్న రోజులున్నాయి
నిను తలుచుకు నేడ్చిన రోజులూ వున్నాయి
నీ కోసం బ్రతికిన రోజులున్నట్టుగానే
నీవు లేక బ్రతకలేని రోజులు మిగిలున్నాయి!
కాటుక నీ కళ్ళకు హద్దైనట్టు
కలవరింపు నా బాధకు పద్దు.
స్పర్శకు చర్మమే తోడన్నట్టు
సరసానికి చీకటొకటే దారి!
ఉరుకులు పరుగులు పెడదామనున్నా
ఊపిరాడక కొట్టుకుంటుంటాను.
తారలు చూస్తూ గడిపే నేను
తరాలకు చాలినంత తపన పడుతుంటాను!
సంధిగ్ధత లేని సమాచారం, సఖ్యతే కుదరని సహగమనం
నీ పయనంలో వైనం, నాది కాదు సుమా వైరం!
అసలేం కావాలో తెలీని నువ్వు, అందుకో లేని అడుగేశావు
అన్నీ తెలుసనుకొన్న నేను, నిన్ను తెలియలేకనే పోయాను!