Saturday, August 9, 2014

అంతరంలో మంచు!

మహా ప్రస్థానం కోసం చస్తున్నారు
మహా ప్రగతంటూ చంపేస్తున్నారు
మహాత్ములమంటూ చావమంటున్నారు
మహానతకు మాత్రం వివరణ లేదన్నారు!


జీవితం బ్రతుకటానికే,  బరిదాటకు
ప్రగతంటూ పురగతిని చిద్రం చేయకు!
వుహలో విలాసాలు ఊయలూగే మనసుకే సరి
ఉద్రేక ద్వేషులు, ఉపాసకులకు అనవసరం!

నిన్న లేనిది నేడు లేదు, రాదు
పరిమిత ప్రయాణంలో ప్రళయం సృష్టించకు
శూన్యంలో వెదికితే ఏముంటుంది యింకా
ధనాగారమే దరిద్ర నిధి కాగలదు!




తెగని విషయాల పట్టింపుకోసం
తగిన విషయాల విస్మరింపు తగదు
లేని దేవుళ్ళ స్థిరీకరణకు
లోని ఆలోచన మలినం చేయకు!

ఏమార్చుతున్నది చైతన్యాన్ని
అందుకోగల రూపాన్ని; చైతన్యాన్ని కాదు
చావు జయించాలంటూ,  బ్రతుకుతూ
ఎన్నెన్నో మార్లు చావఖ్ఖరలేదు!

కక్షలూ, శిక్షలూ సమాజ కాంక్షలు కాలేవు!
వివక్ష లేని ప్రత్యక్ష దీక్షలే భవిష్య పాదరక్షలు!
సాధించాలనుంటే వాదించు, అనువదించు
అంతరంలో మంచు మంచిది కాదని గుర్తించు!


Saturday, July 12, 2014

బ్రతుకుతున్నామా?



బ్రతుకు తున్నామా?
లేక వెతుకు తున్నామా?
తెలీని జీవన ప్రయాణం
వీడని నిరాశలో ఆశా యానం!

తరాలు దాటి సాగిందీ నిజమే
తలలు తీసిన సిద్ధాంతాలూ నిజమే
తల కెక్కినది పైత్యమే నంటూ
తడబడిన మాటా నిజమే!

ఎవరో వున్నారంటున్నవారికి
వారెవరనేదో చిక్కు ప్రశ్న
ఎవరో రావాలనుకొనే నీకు, నీ తపన,
ఎదురు చూపులెంత వరకో?

మాన్పడి నిలచిన మానుకు
మనసుందని కదులుతున్న నీకు
భేదం నినాదం మాత్రమేనా?
మానవత, వాదం మాత్రమేనా?

నివ్వెరపోయి వెనుతిరిగే లోపు
నువ్వుండవనంటే నీ వునికెంత?
తడుముతున్నదంతా తరాలుగా
మిగిలిన పదార్ధమేనంటే నీ ఔన్నత్య మెంత?

స్వాంతన చెందని అంతరానికి
సంతోషం పంచడానికంటూ
మందు, విందు మరి నిదురకొక గొందు
సరిపోతాయంటావా తమ్ముడూ!


Sunday, June 29, 2014

భూమి ఒక తల్లే!


ఆం తరువాత నోటికొచ్చింది అమ్మే!
ఆం తరువాత నాకు రుచించిందీ అమ్మే!

కొమ్మ కొమ్మన ఒక అమ్ముంటుంది
గుడ్లు పొదిగి బిడ్డల్ని కాపాడుతుంది
తన గుండెలనే గూడును కట్టి
కమ్మని భావన తానవుతుంది!

నమ్మకమే దేవుడయితే, అసలు
అమ్మే లేక నమ్మకముండదు?
అందుకే అమ్మ దేవుడవుతుంది
అవును అమ్మ నా దేవుడవుతుంది!

రోతంటే తెలియ చెప్పింది తనే
నను రోయక పెంచింది తనే
కలుగ కూడదట నాకు కష్టం
పరువా లేదనేది తనకొచ్చే నష్టం!

అమ్మ తరువాత కాన రాలేదు మరో మజిలీ
అర్ధమయ్యింది ఎందుకన్నారో భూమిని తల్లి!