బ్రతుకు తున్నామా?
లేక వెతుకు తున్నామా?
తెలీని జీవన ప్రయాణం
వీడని నిరాశలో ఆశా యానం!
తరాలు దాటి సాగిందీ నిజమే
తలలు తీసిన సిద్ధాంతాలూ నిజమే
తల కెక్కినది పైత్యమే నంటూ
తడబడిన మాటా నిజమే!
ఎవరో వున్నారంటున్నవారికి
వారెవరనేదో చిక్కు ప్రశ్న
ఎవరో రావాలనుకొనే నీకు, నీ తపన,
ఎదురు చూపులెంత వరకో?
మాన్పడి నిలచిన మానుకు
మనసుందని కదులుతున్న నీకు
భేదం నినాదం మాత్రమేనా?
మానవత, వాదం మాత్రమేనా?
నివ్వెరపోయి వెనుతిరిగే లోపు
నువ్వుండవనంటే నీ వునికెంత?
తడుముతున్నదంతా తరాలుగా
మిగిలిన పదార్ధమేనంటే నీ ఔన్నత్య మెంత?
స్వాంతన చెందని అంతరానికి
సంతోషం పంచడానికంటూ
మందు, విందు మరి నిదురకొక గొందు
సరిపోతాయంటావా తమ్ముడూ!
No comments:
Post a Comment