ఎల్లలెఱుగని ఏకాంత యానం!
ఎల్లలెఱుగని ఏకాంత మనో యానం
తనెరిగిన వూసులే దానికి ప్రమాణం!
నీ నాల మధ్య నలిగిన నగ్న సంవాదం
పొంతన లేని మనసుల భగ్న వివాదం
నే నొంటరి నెందుకయ్యా ననడిగా నన్ను?
తుంటరి మనసు వినలేదు అందరితో కలసిపోను!
అందుకొని, వదులుకొని అందాలు వెదుకుతారు
గంధాఘ్రాణానంతరం బంధాలు విడిచేస్తారు
అందరూ చెప్పుకొనే చందాలు నేనూ మరిచాను
అందుకే, అందుకే నే నొంటరి నయిపోయాను!
ఏడవలేకనే ఎదో చెప్పుకు పోతుంటాను
ఎదలోతుల కవే కొలతలుగా మప్పుతుంటాను
అసత్యాల కదుపు లుండవని అంటూనే
సత్యం ఆనవాళ్లందని సమాది చేసేస్తుంటాను!
అడక్కుండానే ఒకోసారి ఆత్మీయుల కమ్మని పిలుపు
ఏ వాంఛతో మలిచి వుంచారో నా వంతన్న వెరపు
కాదంటే మరేమి కాదనుకోవాలో నని ఒక జడుపు
ఒంటరితనమే మేలు, వస్తు బంధనాలెందుకనే తలపు!
గుండె సందడుల మధ్య ముల్లులా చిరు ఒత్తిడి
బండలమధ్య జీవితేచ్చ తో నిలిచే ప్రకృతి చిత్తడి
వదలిపోలేని భయం, ప్రాణాలు తీసే విలవిల
మట్టిని పట్టుకు సాగే ఆత్మబంధాల తెగని వల!
పరగులు, ఉరుకులు తనువు పార్ధివ మయ్యేవరకే
మొలకలకు అనువు, చినుకుల ఆనకట్ట తెగే వరకే
నా కివ్వనిదేదో నాక్కావాలని వాపోయింది నిజమే
గానీ
నా కున్న దేదీ నేటికీ సద్వినియోగం కానే కాలేదు!
ప్రయాణం ముగిశాక కూడా నాకై వెదికే వారుండొచ్చు
బెరుగ్గా పలుకరింపు కొక యత్నమూ చెయ్యొచ్చు
మట్టితో ముగిసిపోవు మనసుల జ్ఞాపకాలు
తలపుల తక్కెడలో తలెప్పుడయినా వాలిపోవచ్చు!
No comments:
Post a Comment