ఒడిసి పట్టిన
నీరు
తడుపుకే చాలదు
ఎంతటి
కన్నీటికైనా
ఏ పంటా పండదు!
అటుజారి యిటుజారి
ఆకలికి దిగజారి
అడిగినంత
మాత్రాన
అన్నమెటూ
పుట్టదు!
ఆవలి గట్టు
పొలాలు
కావలి చెట్లనూ
ఫలాలు
వున్నోడికి
అవసరమేంటో తెలీదు
తన పుట్టక పుట్టించినోడికీ
తెలీదు!
ఇంట గంజి కాగు
ఎండి
ఎక్కిరించింది
పంట కాలువ బురద
పందులాటకు
సరంది!
మేనేజరొస్తాడు
మానం తీసి
పోతాడు
ఎకసెక్కాల
పెద్దోలు
పగలబడి
నవ్వుతారు
కురిసిందొక వాన
కొండ కోనల్లోన
వరదలై మిగిలింది
రైతు
గుండెల్లోన!
తలమునగా
పొలం మునక
కన్నేటిదే ఆ మసక
చెట్టు
వేలాడింది పీక తునక!
నిద్ర మాని
నాగలి పట్టాడు
నమ్మిన
వారందరికీ తిండెట్టాడు
దున్నిన మట్టిగానే
తను మారి పోయాడు
వలువ వీగిన మరో కృషీవలుడు!
No comments:
Post a Comment