Wednesday, February 8, 2017

నాక(నేన)ర్ధం కానిది నిజమే!

మార్గాలు మర్మాలు కావు
మరణ ద్వారాలసలే కావు!

మావిటిలేని ఏనుగులా
మదం మనిషి అదుపులో లేనపుడు
మరింత నిస్సిగ్గుగా విసుక్కోవలసిందే
మార్గాలు మాత్రం మనమే వేసుకోవాలి!

అలసిపోయామని ఆకలి దాగదు
అదిరిపోయామని ఆగడమూ ఆగదు
హరించిన సొమ్ములు భరించిన యుద్ధమిది
తలవంచి బ్రతికినా తల తెగక మానదు!

క్షణ భంగుర జీవిత మంటూనే
తక్షణ భోగాలకు తెగబడే నరుడు
తనకు కష్టమనిపించే హితవేదీ
సాగినంత కాలం విననే వినడు!

శృతి లేక అపశృతి లేదన్నట్టు
ఆదరణతోనే అనాదరణ పెరుగుతుంది
ఆదరణ అవసరమా, అనవసరమా?
మరి సహనం ప్రహసన వ్యాజ్యమా?
చెప్పాలన్నదేదో నా తరఫు నిజమే, అయినా
నాకు నేనర్దం కానిది కూడా నిజమే!

సహదారి!


సహదారులు కొన్ని రహదారులు కావేమో!
దారులు తెలిసాక గోదారెక్కడ నడగరుగా!

అమ్మ చెయ్యి విదిలించుకు నడిచినా
నాన్న భయం ఓ దారుందనిచెప్పేది
తెగించి తెడ్డే దారంటున్న రోజుల్లో
ఎడారుల్లో బిడారుల్లా నిలిచే వారెవరు?

తను మెచ్చింది గంగ, తనకు నచ్చింది రంభ
అన్నీ స్త్రీ లింగాలేనా, పురుష పుంగవములు లేవా?
వాస్తవానికి వార్ధక్యం, మోహానికి సారధి వుండవు
వయసు మాట, చాదస్తమని చతికిల బడ్డోడే, చవట!

ఏం కావాలో తెలీక ఏమిస్తే తీరుతుంది కుతి
కలదిరిగి చూసేవు, వెనుదిరిగి చూడు లోపలికి
ఖాళీ, అంతా నైరాశ్యం, నమ్మలేని వైరాగ్యం
ఏమయ్యిందా జీవితకాలపు నిండని మోజు?

అబ్దులెన్నో దాటిన ప్రారబ్దపు శబ్దాల మాటేమిటి
అనేద్దామా, ఆశే యింత నేరం చేసిందని!
ఆశ లేని బాసల్లో అసలు వూసులెలా సాధ్యం?
ప్రకాశానికి ఆశ చీకటయితే ఆకాశానికి వాకిలేది?

అడుసు తోక్కాక ఆలోచించక ఎలా కడగాలని
మనో వాంఛలు మంచు ముద్దలు
అసలు రూపాన్నవి ఎలాగూ దాచవు
నీలో వెలుగు చాలు చీకట్లు ఆపను

అంగట్లో చాలా అమ్మకాని కున్నా
వాటవసరం వుందా నీకేమన్నా?
వేలం వెర్రంటే తెలుసుకుంటావా మరి
ఇరుకుటిళ్ళల్లో మరో పెళ్లి అంటే సరి!

Tuesday, January 10, 2017

వెతకటమంటూ వెనుదిరగకు! ముందున్నదే నీ మార్గం

వెతకటమంటూ
వెనుదిరగకు!
 Image result for never turn backImage result for never turn back
వేల దావానలాలు
విరివిగా సాగిన దాడులు
క్రుంగదీసి వంచిన నిన్ను
వెనుతిరిగి చూడకు!

అడియాసల ఆవిరులు
అహం చిమ్మిన సందడులు
పరుగులెట్టిన మనసును
మట్టి కరిపించిన రోజులు!

ఉద్వేగపు వూపులకు
ఊతమిచ్చిన సంశయాలు
భ్రంశమయిన స్థితుల కొరకు
రోదించిన వేదన రాత్రులు!

అన్నీ దాటాకనే
నీవీ, అంచు చేరి వున్నావు
అగాధాలు  అలవికావు, అవి
అనాలోచితంగా వెదుకకు!

నీవున్నది నిజమే, అయినా
నీలో వున్నది నిజం కాదు!
మసక వెలుగులో కదిలే మబ్బులు
ఆకాశం కర్ధం చెప్పవు!

ముసి నవ్వుల కోసమో
ముగింపు వాక్యం కోసమో
మిగిలిన జీవిత మనర్ధం కారాదంటే
మరోమారు వెను తిరుగకు!

పిరికితనమనే పంతంలో
చెంతనున్న సమయం వదలకు
ఈ రోజు నీకు నిజం, తెలీనిది,
ఉన్నదో లేదో మరో ‘అజం’!

సృష్టి, వెనుక దృష్టి కోరదు
కోరుంటే, కళ్ళుండేవి మరి!
నీ భయాలేవైన
ముందున్నదే నీ మార్గం!
(అజం అంటే అడుగు అని అర్ధం)