Wednesday, February 8, 2017

సహదారి!


సహదారులు కొన్ని రహదారులు కావేమో!
దారులు తెలిసాక గోదారెక్కడ నడగరుగా!

అమ్మ చెయ్యి విదిలించుకు నడిచినా
నాన్న భయం ఓ దారుందనిచెప్పేది
తెగించి తెడ్డే దారంటున్న రోజుల్లో
ఎడారుల్లో బిడారుల్లా నిలిచే వారెవరు?

తను మెచ్చింది గంగ, తనకు నచ్చింది రంభ
అన్నీ స్త్రీ లింగాలేనా, పురుష పుంగవములు లేవా?
వాస్తవానికి వార్ధక్యం, మోహానికి సారధి వుండవు
వయసు మాట, చాదస్తమని చతికిల బడ్డోడే, చవట!

ఏం కావాలో తెలీక ఏమిస్తే తీరుతుంది కుతి
కలదిరిగి చూసేవు, వెనుదిరిగి చూడు లోపలికి
ఖాళీ, అంతా నైరాశ్యం, నమ్మలేని వైరాగ్యం
ఏమయ్యిందా జీవితకాలపు నిండని మోజు?

అబ్దులెన్నో దాటిన ప్రారబ్దపు శబ్దాల మాటేమిటి
అనేద్దామా, ఆశే యింత నేరం చేసిందని!
ఆశ లేని బాసల్లో అసలు వూసులెలా సాధ్యం?
ప్రకాశానికి ఆశ చీకటయితే ఆకాశానికి వాకిలేది?

అడుసు తోక్కాక ఆలోచించక ఎలా కడగాలని
మనో వాంఛలు మంచు ముద్దలు
అసలు రూపాన్నవి ఎలాగూ దాచవు
నీలో వెలుగు చాలు చీకట్లు ఆపను

అంగట్లో చాలా అమ్మకాని కున్నా
వాటవసరం వుందా నీకేమన్నా?
వేలం వెర్రంటే తెలుసుకుంటావా మరి
ఇరుకుటిళ్ళల్లో మరో పెళ్లి అంటే సరి!

No comments:

Post a Comment