పిల్లల్లేనాళ్ళకంటే
కొడుకుల్లేనాళ్ళే కొట్టుమిట్టాడారు
కూతుర్ని కాదన్న క్రూర సమాజంలో
మనుగడకోసం మసిలిపోయారు!
పట్టుపావడా జరీ వోణీలు
పట్టపురాణుల తలదన్నే బాణీలు
పరువుకు పట్టంగట్టిన
అమ్మనాన్నలు అలమటించక తప్పలేదు!
కాలుడితో కదనానికి
కాడి రమ్మంటుంటే
కవ్వింపుకు తలొగ్గి తల్లడిల్లిపోయారు
పున్నామ మేమిటి, పుత్రుడేడని వుడుక్కు చచ్చారు!
నీతి మాలినోడి ఒప్పే
నీతున్నోడికి తప్పు
గొయ్యితీత రానోడి వురివేత
యీ సమాజాని కతి మెప్పు!
నిరాశను నిండుగా నింపి
నిజమంటూ ఒక పేరు పెట్టి
ఎప్పుడో రాబోయే చావు
నేడే రుచి చూపటం లౌఖ్యానికే నప్పు!
ఆడబిడ్డ నడ్డి వంచమనీ
మొగ్గలోనే తుంచమనీ
పనికట్టుకు నూరిపోసినోళ్ళు
అమ్మలు, అమ్మమ్మలే విజానికి!
కాదని యెదిరించే
కనిపెంచారు తల్లిదండ్రులు
కళ్ళల్లో వత్తులేసుకు
సంఘంలో యెత్తులు తల్లుల సొత్తు చేసారు!
ఇల్లాల్ని తెచ్చుకొన్నందుకు
పాపం, కన్నతల్లుల్నొదులుకోవటం
కళ్ళనీళ్ళు కారితే
కనిపిస్తాయేమోనని దాచుకోవటం!
కసాయితనం
కన్నాళ్ళదా, కాలానిదా?
అనుకొంటూనే, అరా వదులుకోవటం
అరమరకలు లేని
బంధం అసలు లేకనే లేక పోవటం
ఎవరు చేసిన పడికట్టో
యీ గట్టులేని కాల సముద్రంలో కొట్టుకు పోవటం?
No comments:
Post a Comment