(ఆశ్వయుజ పున్నమినే శరత్ పున్నమంటారు. శరత్ కాలాన్ని సూచించే శారద (నవ) రాత్రులు, పౌర్ణమి యెంత ప్రసిధ్ధమయినవో తెలీదు గానీ, కలలు గనే కవుల కలాల ద్వారా వడివడిగా ప్రవహించే రక్తం మేలుకొలిపే వూహల గిలిగింతలు మనకు అలనాటి నుండి చిర పరిచయాలే! అందుకే మనదేశంలో శరత్ లేక శరత్ చంద్రుడతి ప్రీతి పాత్రుడు!)
అనుభవంలో:
నా శరత్ పున్నమి
-----------------------------శ్యాం ప్రసాద్ బెజవాడ
కవితా నుడికారాల ముడులకు సాక్షులు
తోడులేని బంధాల కందాల చక్షువులు
మంద సమీర మేఘావృత వెన్నల రాశులు
శశి రతి సలిపెడు శారద రాత్రులు!
పుష్కరాల మునుపో నల్లని శారద పున్నమి
అనంత నాగుల విషాన్ని కక్కింది
కాలకూట సమమో కాదో నది మరి
కంఠాన నిలిపి నిలచి జీవించినదే సరి!
వికృత విన్యాసాల సంఘ, మానాటి మర్కటం
ఆమె నంతమొందించి పలికిన రోజది, కర్కశం
నలుగురు తల్లులకొక తండ్రి వుండాలన్నదవసరం
ఆమె లేక, అదలా కానేరదంటున్న హీన స్వరం!
నాలుగు భుజాలు కూడిన నిచ్చెన, కాయాన్ని పైకెత్తుకుంది
గుండెలోని నిప్పులు జేర్చిన కుండ, నాచేతిని హత్తుకుంది!
మెట్టినింటికి మట్టెలు మిగిల్చి గట్టెక్కిపోయిం, దొక శ్రీమతి
కట్టలు తెగిన పాతచరిత్ర చుట్టచుట్టి పెట్టేయమందో, సుమతి!
పంతానికి తాగిన పచ్చిమందు, సీసా నిండుకుంది
మిన్నంటి సాగిన యేడుపు, అలసట నందుకుంది
ఆదర్శమేమో, అనర్ధమేదో, జరిగిన దానిలో సమర్ధమేమో
నే నడవటమే ముఖ్యం, కాలం గడవటమే ముఖ్యం!
మార్గం మరోటి లేదిక; మలుపు తిరుగడానికి.
దుర్గమ దుష్టాంతాలే నన్నీ; మరో తలుపు తెరువటానికి
అందరూ వుండి ఒంటరి నయిపోయానని, కినుక!
ఆవేశం కాని తుంటరి తనంతో మనసు నిండా అలుక!
రోజుకు గంటలెన్నో తెలీదు
మోజుకు యేది మిన్నో తెలీదు
గొడ్డులా పనిచేసినది కానేరదు నిజం
గానుగ కట్టిన గొడ్డయింది నా మనోగజం!
నాజివన యాగానికటుపై లేవు మహోగ్ర తర్పణలు
సుదూరపు వెలుగుల చిరుకోర్కెలే చర్విత చర్వణలు
చిరుదీపాలు తుదకు ప్రఛండ కాంతులు కానేలేదు
ఊహలు నిండిన వూసులు అనుభవానికి రానేలేదు!
వదలక, తరిమి తలదించింది నన్ను, విధి!
తర్కానికి తార్కాణం కారాదంటున్న మది!
అదొక యాగమనుకొని బ్రతికానిన్నాళ్ళు
మలిసంధ్య కాలాపన రాగమని బ్రతికానిన్నేళ్ళు!
పలుచన సలుపుతూ బ్రతుకింకెందుకు
లేని యే సుర భోగాల నందుకొనేందుకు
బాధను విడిచి బడలిక తీర్చుకొన్న తప్పేమిటి?
ఇంతటితో వూదుడు మానుకొన్న ముప్పేమిటి?
ఎట్టకేలకు దరిజేరి పోయా నా జీవన సంధ్య
అలుపుతో అహం సాగించింది గతాల నింధ్య!
ప్రతీ యేటా వచ్చిన, శరత్ పున్నమి కాంతి
పొసగనీయలేదు నా మనసు కెలాంటి విశ్రాంతి!
దివిని నిండి శరత్ చంద్రుని చుట్టేసాయి మేఘాల ముక్కలు
ఇది మరో శరత్ పున్నమన్నాయి
కన్నీటి చుక్కలు!
No comments:
Post a Comment