Wednesday, December 28, 2016

పారెంటింగ్ ఏ డే



అమ్మ దినం
నాన్న దినం
లేమికి సంతాప దినం
ఉండి లేని గుర్తే అనుదినం!

బాపడు తద్దినం గుణిస్తే నవ్విన నోళ్ళే
అమ్మా, నాన్నలకు దినాలంటూ నవ్వే మనోళ్ళు
కడవెత్తుకు తాగ నోళ్ళు
గొట్టాలతో పీల్చి నట్టు
సున్ని పూత కాదనుకొని
ముఖ మలాము రాసినట్టు
పక్క మీద జీన్స్ దురద
తాళలేక  దొర్లి నట్టు
బిడ్డడితో సేల్ఫీ కోరే నీకు
తండ్రొకడున్నాడు తెలుసా?
కొత్త వింత
రంగుల పుంత
కాలం అది సాగినంత
ఇంతకూ, నీకేది నిశ్చింత?
గతం వుందంటే
ఉన్నదేమో పాల పుంత
దృశ్యమై సాగటమే సంగతంతా
అదృశ్యమై పోతామన్నది నీకూ తెలుసా?
నీలాగే నీ పెద్దలదొక గది
ఆ హద్దుల గది మధ్య వారి మది
ఆ కోరికే నిను దృశ్యం చేసింది
చావనంత వరకూ తనలో మోస్తుంది
అటుపైనా దృశ్యమై నీవు కొన సాగుతావు
వెనుతిరిగి మాత్రం చూడకు ఎవర్నీ వెదుక లేవు
 ‘ఒక్క ముద్ద’oటూ తినిపించిన అమ్మకు
ఒక ముద్దు పెట్ట గలనని మాత్రం నమ్మకు
బ్రతికుంటే బాధ పెడతాం............
చచ్చాక శార్ధం పెడతాం!
నీ గుర్తులు నీవిగా చెప్పుకోనేందుకే
ఘనతను రూఢి చేసుకో, పో ముందుకు!
(Originally written on 19/06/2016 &

Recompiled on 27/12/2016 at 05:35
and finalised on 29/12/2016 at 7:47 )

Wednesday, December 14, 2016

వలువ వీగిన కృషీవలుడు!



ఒడిసి పట్టిన నీరు
తడుపుకే చాలదు
ఎంతటి కన్నీటికైనా
ఏ పంటా పండదు!

అటుజారి యిటుజారి
ఆకలికి దిగజారి
అడిగినంత మాత్రాన
అన్నమెటూ పుట్టదు!

ఆవలి గట్టు పొలాలు
కావలి చెట్లనూ ఫలాలు
వున్నోడికి అవసరమేంటో తెలీదు
తన పుట్టక పుట్టించినోడికీ తెలీదు!

ఇంట గంజి కాగు
ఎండి ఎక్కిరించింది
పంట కాలువ బురద
పందులాటకు సరంది!

మేనేజరొస్తాడు
మానం తీసి పోతాడు
ఎకసెక్కాల పెద్దోలు
పగలబడి నవ్వుతారు

కురిసిందొక వాన
కొండ కోనల్లోన
వరదలై మిగిలింది
రైతు గుండెల్లోన!

తలమునగా
పొలం మునక
కన్నేటిదే ఆ మసక
చెట్టు వేలాడింది పీక తునక!

నిద్ర మాని నాగలి పట్టాడు
నమ్మిన వారందరికీ తిండెట్టాడు
దున్నిన మట్టిగానే తను మారి పోయాడు
వలువ వీగిన మరో కృషీవలుడు!



ఎందుకేడ్చాను నేను!

ఎందుకేడ్చాను నేను!

తప్పు చేశానని ఏడ్చానా
తప్పేదో తెలీక ఏడ్చానా
తనివితీరని వాస్తవాల వేటలో
తపనలో వాటాదారుడై ఏడ్చానా!

ఎంతో ఎగిరి అందుకో బోయిన ఫలం
అందక రాలి బురద పాలైందని ఏడ్చానా
కందిన ఇల్లాలి బుగ్గలందిన యెరుపు
సిగ్గు కాదది తలొగ్గి నందుకని ఏడ్చానా

ఆడ పిల్లలు పుట్టినందుకు ఏడ్చానా
అమ్మ యిక లేదని ఆగలేక ఏడ్చానా
ఆమెను అకారణంగా అల్లరి చేస్తున్నారని ఏడ్చానా
ఆమె వదిలినా ఆమె నా మనసు వదల లేదని  ఏడ్చానా

అలవికాని ఎడారిలో అలసిపోయి ఏడ్చానా
ఆవిరైన కన్నీటిలో ఆత్మీయత వుందని ఏడ్చానా
విధి, దైవం వున్నాయని నమ్మి ఏడ్చానా
అర్ధం కాని జీవితంలో తప్పటడుగేదొ తెలీక ఏడ్చానా

సాయం సంధ్యలో మందభాగ్యం గుర్తొచ్చి ఏడ్చానా
ఆనందాల వెనుక దుర్గందాల జాడ తెలిసి ఏడ్చానా
పవిత్రతే ఒక విచిత్ర చిత్రమని ఏడ్చానా
పాచి పట్టిన నీతుల గోతుల్లో పడి లేవలేక ఏడ్చానా

ఒంటె నీటిని వుంచుకొన్నట్టు ఆనందాన్ని వుంచుకోలేక ఏడ్చానా
పరచుకున్నజీవితం పల్లం తెలియని ముళ్ళ బాటేనని ఏడ్చానా
నే చేశాననుకున్న సాహసం గతిలేని విన్యాసమని ఏడ్చానా
నచ్చని జీవితమని నలుగురి భయానికి చెప్పలేక ఏడ్చానా

ఎదురొచ్చిన ప్రేమలు వెనకున్న ఆస్తుల కోసమని ఏడ్చానా
కదిలోచ్చిన వారసులు మిగిల్చిన విషాదాన్ని తలుచుకొని ఏడ్చానా
మంచి చెప్పి మాట పడవలసొచ్చి సమాజ మౌనానికి ఏడ్చానా
మారుమూల మాట లేక వుండని శ్వాసల చిలిపి తనానికే ఏడ్చానా?

నే నేడ్చిందెందుకో నాకే తెలీక ఏడ్చానా
కాదు, నాకు రుచించనిది నేనెందుకు వినాలని ఏడ్చాను
అబద్ధాల ఆలింగనకు ఆరాటం దేనికని ఏడ్చాను
అర్ధం తెలీని విషయాల ఆరాధనేమిటని ఏడ్చాను
మనసులోని మలినాలకు మానవతను శంకించి ఏడ్చాను
మాతృత్వానికి మరేది సాటి రాదని తెలిసి ఏడ్చాను
మమతకు మనిషి స్పర్శ అవసరమే లేదని ఏడ్చాను
ఎడారి వేడిలో కరిగిపోని ప్రేమలు గుర్తొచ్చి ఏడ్చాను
ఆవిరైన కన్నీరు ఆత్మీయులకు వర్షం కావాలని ఏడ్చాను
కట్టుకున్న బంధాలు నిలబెట్టేది విధాతేమోనని మ్రొక్కి ఏడ్చాను
నా అడుగులు నలుగురికి మార్గం చూపాలని ఆశతో ఏడ్చాను
రానున్న రోజుల సాయం సంధ్యల ఆనందాల వూహల్లో ఏడ్చాను
నీతుల కతీతమైన సంబంధాల పవిత్రత కనుమతి లేదని ఏడ్చాను
పంచుకున్న మాధుర్యాల సంచికలు చదువుకొని ఏడ్చాను
కష్టాలు కడవరకు ఓర్పుగా నాతో రాలేవన్న నమ్మకంలో ఏడ్చాను
సాహసానికి సహవాసం సహకరించక తప్పదని తెలిసి ఏడ్చాను
ఎగిసిపడే దుఃఖ తరంగాల నణగ దొక్కేందుకు ఏడ్చాను
కాలుతున్న గుండెలకు కన్నీరే చన్నీరని ఏడ్చాను
నేను బ్రతికేయాలనే ప్రభల వాంచతో బరువెక్కి ఏడ్చాను
ఏడుపు నాకు తుదకు మార్గం చెప్పదని తెలీకే ఏడ్చాను
ఎడవటానికి ఎదో మిగిలున్నంత సేపూ ఏడ్చాను!
ఏడవను ఏమీ మిగల్లేదు! అవును యిక ఏడవను!

Saturday, April 9, 2016

Ellalu erugani ekanta yanam/ ఎల్లలెఱుగని ఏకాంత యానం!


ఎల్లలెఱుగని ఏకాంత యానం!

ఎల్లలెఱుగని ఏకాంత మనో యానం
తనెరిగిన వూసులే దానికి ప్రమాణం!

నీ నాల మధ్య నలిగిన నగ్న సంవాదం
పొంతన లేని మనసుల భగ్న వివాదం
నే నొంటరి నెందుకయ్యా ననడిగా నన్ను?
తుంటరి మనసు వినలేదు అందరితో కలసిపోను!

అందుకొని, వదులుకొని అందాలు వెదుకుతారు
గంధాఘ్రాణానంతరం బంధాలు విడిచేస్తారు
అందరూ చెప్పుకొనే చందాలు నేనూ మరిచాను
అందుకే, అందుకే నే నొంటరి నయిపోయాను!

ఏడవలేకనే ఎదో చెప్పుకు పోతుంటాను
ఎదలోతుల కవే కొలతలుగా మప్పుతుంటాను
అసత్యాల కదుపు లుండవని అంటూనే
సత్యం ఆనవాళ్లందని సమాది చేసేస్తుంటాను!

అడక్కుండానే ఒకోసారి ఆత్మీయుల కమ్మని పిలుపు
ఏ వాంఛతో మలిచి వుంచారో నా వంతన్న వెరపు
కాదంటే మరేమి కాదనుకోవాలో నని ఒక జడుపు
ఒంటరితనమే మేలు, వస్తు బంధనాలెందుకనే తలపు!

గుండె సందడుల మధ్య ముల్లులా చిరు ఒత్తిడి
బండలమధ్య జీవితేచ్చ తో నిలిచే ప్రకృతి చిత్తడి
వదలిపోలేని భయం, ప్రాణాలు తీసే విలవిల
మట్టిని పట్టుకు సాగే ఆత్మబంధాల తెగని వల!

పరగులు, ఉరుకులు తనువు పార్ధివ మయ్యేవరకే
మొలకలకు అనువు, చినుకుల ఆనకట్ట తెగే వరకే
నా కివ్వనిదేదో నాక్కావాలని వాపోయింది నిజమే గానీ
నా కున్న దేదీ నేటికీ సద్వినియోగం కానే కాలేదు!

ప్రయాణం ముగిశాక కూడా నాకై వెదికే వారుండొచ్చు
బెరుగ్గా పలుకరింపు కొక యత్నమూ చెయ్యొచ్చు
మట్టితో ముగిసిపోవు మనసుల జ్ఞాపకాలు
తలపుల తక్కెడలో తలెప్పుడయినా వాలిపోవచ్చు!