Saturday, August 9, 2014

అంతరంలో మంచు!

మహా ప్రస్థానం కోసం చస్తున్నారు
మహా ప్రగతంటూ చంపేస్తున్నారు
మహాత్ములమంటూ చావమంటున్నారు
మహానతకు మాత్రం వివరణ లేదన్నారు!


జీవితం బ్రతుకటానికే,  బరిదాటకు
ప్రగతంటూ పురగతిని చిద్రం చేయకు!
వుహలో విలాసాలు ఊయలూగే మనసుకే సరి
ఉద్రేక ద్వేషులు, ఉపాసకులకు అనవసరం!

నిన్న లేనిది నేడు లేదు, రాదు
పరిమిత ప్రయాణంలో ప్రళయం సృష్టించకు
శూన్యంలో వెదికితే ఏముంటుంది యింకా
ధనాగారమే దరిద్ర నిధి కాగలదు!




తెగని విషయాల పట్టింపుకోసం
తగిన విషయాల విస్మరింపు తగదు
లేని దేవుళ్ళ స్థిరీకరణకు
లోని ఆలోచన మలినం చేయకు!

ఏమార్చుతున్నది చైతన్యాన్ని
అందుకోగల రూపాన్ని; చైతన్యాన్ని కాదు
చావు జయించాలంటూ,  బ్రతుకుతూ
ఎన్నెన్నో మార్లు చావఖ్ఖరలేదు!

కక్షలూ, శిక్షలూ సమాజ కాంక్షలు కాలేవు!
వివక్ష లేని ప్రత్యక్ష దీక్షలే భవిష్య పాదరక్షలు!
సాధించాలనుంటే వాదించు, అనువదించు
అంతరంలో మంచు మంచిది కాదని గుర్తించు!


Saturday, July 12, 2014

బ్రతుకుతున్నామా?



బ్రతుకు తున్నామా?
లేక వెతుకు తున్నామా?
తెలీని జీవన ప్రయాణం
వీడని నిరాశలో ఆశా యానం!

తరాలు దాటి సాగిందీ నిజమే
తలలు తీసిన సిద్ధాంతాలూ నిజమే
తల కెక్కినది పైత్యమే నంటూ
తడబడిన మాటా నిజమే!

ఎవరో వున్నారంటున్నవారికి
వారెవరనేదో చిక్కు ప్రశ్న
ఎవరో రావాలనుకొనే నీకు, నీ తపన,
ఎదురు చూపులెంత వరకో?

మాన్పడి నిలచిన మానుకు
మనసుందని కదులుతున్న నీకు
భేదం నినాదం మాత్రమేనా?
మానవత, వాదం మాత్రమేనా?

నివ్వెరపోయి వెనుతిరిగే లోపు
నువ్వుండవనంటే నీ వునికెంత?
తడుముతున్నదంతా తరాలుగా
మిగిలిన పదార్ధమేనంటే నీ ఔన్నత్య మెంత?

స్వాంతన చెందని అంతరానికి
సంతోషం పంచడానికంటూ
మందు, విందు మరి నిదురకొక గొందు
సరిపోతాయంటావా తమ్ముడూ!


Sunday, June 29, 2014

భూమి ఒక తల్లే!


ఆం తరువాత నోటికొచ్చింది అమ్మే!
ఆం తరువాత నాకు రుచించిందీ అమ్మే!

కొమ్మ కొమ్మన ఒక అమ్ముంటుంది
గుడ్లు పొదిగి బిడ్డల్ని కాపాడుతుంది
తన గుండెలనే గూడును కట్టి
కమ్మని భావన తానవుతుంది!

నమ్మకమే దేవుడయితే, అసలు
అమ్మే లేక నమ్మకముండదు?
అందుకే అమ్మ దేవుడవుతుంది
అవును అమ్మ నా దేవుడవుతుంది!

రోతంటే తెలియ చెప్పింది తనే
నను రోయక పెంచింది తనే
కలుగ కూడదట నాకు కష్టం
పరువా లేదనేది తనకొచ్చే నష్టం!

అమ్మ తరువాత కాన రాలేదు మరో మజిలీ
అర్ధమయ్యింది ఎందుకన్నారో భూమిని తల్లి!

Monday, December 2, 2013

కొడుకుల్లేనోళ్ళు



పిల్లల్లేనాళ్ళకంటే
కొడుకుల్లేనాళ్ళే కొట్టుమిట్టాడారు
కూతుర్ని కాదన్న క్రూర సమాజంలో
మనుగడకోసం మసిలిపోయారు!

పట్టుపావడా జరీ వోణీలు
పట్టపురాణుల తలదన్నే బాణీలు
పరువుకు పట్టంగట్టిన 
అమ్మనాన్నలు అలమటించక తప్పలేదు!

కాలుడితో కదనానికి
కాడి రమ్మంటుంటే
కవ్వింపుకు తలొగ్గి తల్లడిల్లిపోయారు
పున్నామ మేమిటి, పుత్రుడేడని వుడుక్కు చచ్చారు!

నీతి మాలినోడి ఒప్పే
నీతున్నోడికి తప్పు
గొయ్యితీత రానోడి వురివేత
యీ సమాజాని కతి మెప్పు!

నిరాశను నిండుగా నింపి
నిజమంటూ ఒక పేరు పెట్టి
ఎప్పుడో రాబోయే చావు
నేడే రుచి చూపటం లౌఖ్యానికే నప్పు!

ఆడబిడ్డ నడ్డి వంచమనీ
మొగ్గలోనే తుంచమనీ
పనికట్టుకు నూరిపోసినోళ్ళు
అమ్మలు, అమ్మమ్మలే విజానికి!

కాదని యెదిరించే
కనిపెంచారు తల్లిదండ్రులు
కళ్ళల్లో వత్తులేసుకు
సంఘంలో యెత్తులు తల్లుల సొత్తు చేసారు!

ఇల్లాల్ని తెచ్చుకొన్నందుకు
పాపం, కన్నతల్లుల్నొదులుకోవటం
కళ్ళనీళ్ళు కారితే 
కనిపిస్తాయేమోనని దాచుకోవటం!
కసాయితనం
కన్నాళ్ళదా, కాలానిదా?
అనుకొంటూనే, అరా వదులుకోవటం
అరమరకలు లేని 
బంధం అసలు లేకనే లేక పోవటం
ఎవరు చేసిన పడికట్టో
యీ గట్టులేని కాల సముద్రంలో కొట్టుకు పోవటం?

Thursday, October 31, 2013

శరత్ పున్నమి

(ఆశ్వయుజ పున్నమినే శరత్ పున్నమంటారు. శరత్ కాలాన్ని సూచించే శారద (నవ) రాత్రులు, పౌర్ణమి యెంత ప్రసిధ్ధమయినవో తెలీదు గానీ, కలలు గనే కవుల కలాల ద్వారా వడివడిగా ప్రవహించే రక్తం మేలుకొలిపే వూహల గిలిగింతలు మనకు అలనాటి నుండి చిర పరిచయాలే! అందుకే మనదేశంలో శరత్ లేక శరత్ చంద్రుడతి ప్రీతి పాత్రుడు!)
 అనుభవంలో:

నా  శరత్ పున్నమి
-----------------------------శ్యాం ప్రసాద్ బెజవాడ

కవితా నుడికారాల ముడులకు సాక్షులు
తోడులేని బంధాల కందాల చక్షువులు
మంద సమీర మేఘావృత వెన్నల రాశులు
శశి రతి సలిపెడు శారద రాత్రులు!

పుష్కరాల మునుపో నల్లని శారద పున్నమి
అనంత నాగుల విషాన్ని కక్కింది
కాలకూట సమమో కాదో నది మరి
కంఠాన నిలిపి నిలచి జీవించినదే సరి!

వికృత విన్యాసాల సంఘ, మానాటి మర్కటం
ఆమె నంతమొందించి పలికిన రోజది, కర్కశం
నలుగురు తల్లులకొక తండ్రి వుండాలన్నదవసరం
ఆమె లేక, అదలా కానేరదంటున్న హీన స్వరం!

నాలుగు భుజాలు కూడిన నిచ్చెన, కాయాన్ని పైకెత్తుకుంది
గుండెలోని  నిప్పులు జేర్చిన కుండ, నాచేతిని హత్తుకుంది!
మెట్టినింటికి మట్టెలు మిగిల్చి గట్టెక్కిపోయిం, దొక శ్రీమతి
కట్టలు తెగిన పాతచరిత్ర చుట్టచుట్టి పెట్టేయమందో, సుమతి!

పంతానికి తాగిన పచ్చిమందు, సీసా నిండుకుంది
మిన్నంటి సాగిన యేడుపు, అలసట నందుకుంది
ఆదర్శమేమో, అనర్ధమేదో, జరిగిన దానిలో సమర్ధమేమో
నే నడవటమే ముఖ్యం, కాలం గడవటమే ముఖ్యం!

మార్గం మరోటి లేదిక; మలుపు తిరుగడానికి.
దుర్గమ దుష్టాంతాలే నన్నీ; మరో తలుపు తెరువటానికి
అందరూ వుండి ఒంటరి నయిపోయానని, కినుక!
ఆవేశం కాని తుంటరి తనంతో మనసు నిండా అలుక!

రోజుకు గంటలెన్నో తెలీదు
మోజుకు యేది మిన్నో తెలీదు
గొడ్డులా పనిచేసినది కానేరదు నిజం
గానుగ కట్టిన గొడ్డయింది నా మనోగజం!

నాజివన యాగానికటుపై లేవు మహోగ్ర తర్పణలు
సుదూరపు వెలుగుల చిరుకోర్కెలే చర్విత చర్వణలు
చిరుదీపాలు తుదకు ప్రఛండ కాంతులు కానేలేదు
ఊహలు నిండిన వూసులు అనుభవానికి రానేలేదు!

వదలక, తరిమి తలదించింది నన్ను, విధి!
తర్కానికి తార్కాణం కారాదంటున్న మది!
అదొక యాగమనుకొని బ్రతికానిన్నాళ్ళు
మలిసంధ్య కాలాపన రాగమని బ్రతికానిన్నేళ్ళు!


పలుచన సలుపుతూ బ్రతుకింకెందుకు
లేని యే సుర భోగాల నందుకొనేందుకు
బాధను విడిచి బడలిక తీర్చుకొన్న తప్పేమిటి?
ఇంతటితో వూదుడు మానుకొన్న ముప్పేమిటి?
ఎట్టకేలకు దరిజేరి పోయా నా జీవన సంధ్య
అలుపుతో అహం సాగించింది గతాల నింధ్య!
ప్రతీ యేటా వచ్చిన, శరత్ పున్నమి కాంతి
పొసగనీయలేదు నా మనసు కెలాంటి విశ్రాంతి!

దివిని నిండి శరత్ చంద్రుని చుట్టేసాయి మేఘాల ముక్కలు
ఇది మరో శరత్ పున్నమన్నాయి  కన్నీటి చుక్కలు!


Saturday, October 26, 2013

పెద్దరికం

పెద్దరికం

ఈదేశపు పెద్ద జబ్బు, పెద్దరికమంటే డబ్బు
కోరుకుంటేనే సుద్దులు, అలోచనుంటే బుధ్దులు!
ఎందుకు కొఱగాని యువత యేమయినా చెబుతుంది
తాతగ మారిన తనయుని రోతకు గురి చేస్తుంది!


మగతనాన్ని శంకించే నవతే మా యువగణం
మద్యం, మత్తు వాసనలకు సాగుతున్నదే రణం
జీవితమను మీటనిపుడు చేతికంటి వుంచాలి
పురిటి పాపలను సహితం ప్రభుత్వమే పెంచాలి
వుమ్మి అంటినా సరే, సొమ్ము మాకు కావాలి
కాలికి పని లేకుండా కైపు మాకు రావాలి
భోగ భాగవతము నేటి కధా వస్తువును నడుపు
అభాగినుల ఆర్తనాదమే అందుకు తొలి ఆట విడుపు
జంతు బంధ వారధిగా ధనమే మాకాధారం
వింత నడక మృగాలే మన రోడ్ల పైన విడ్డూరం!

అహంకార అనాగరికుల వారసత్వ ధోరణిలో
గతంలేదు, మతంలేదు మానవ కమతం లేదు
తప్పులు వెదికే నీలో తృప్తికి దారే లేదు
పప్పులుడకవని తెలిసీ కష్టానికి వళ్లు రాదు!

కావాలిసినదేంటి నీకు పెద్దరికపు జాలు నుంచి
వసి వాడిన కనుల క్రింద నలుపెక్కిన సాలు నుంచి
తెలియాలనుందా నీకు ముసలి జీవ సమర ఘోష
అర్హతగా ముందు వెదుకు, అవగాహనకంటూ భాష?